- చాంగే 6 ల్యాండింగ్ విజయవంతం
- చంద్రుడి మట్టిని భూమికి తేనున్న డ్రాగన్
బీజింగ్: చైనాకు చెందిన చాంగే 6 ల్యాండర్ చంద్రుడి అవతలి ప్రాంతంలో విజయవంతంగా ల్యాండ్ అయింది. అయిట్కిన్ బేసిన్ అనే క్రేటర్ లో ఆదివారం ఉదయం స్పేస్ క్రాఫ్ట్ దిగిందని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఎన్ఎస్ఏ) ప్రకటించింది. చంద్రుడి అవతలివైపు నుంచి రాళ్లు, మట్టి నమూనాలను భూమిపైకి తెచ్చేందుకు ఈ మిషన్ చేపట్టామని సీఎన్ఎస్ఏ పేర్కొంది.
‘‘ల్యాండర్ దిగే సమయంలో అడ్డంకులను గుర్తించడానికి అటానమస్ విజువల్ అవాయిడెన్స్ సిస్టంను ఉపయోగించాం. చంద్రుడి ఉపరితలంపై ఉండే చీకటి, వెలుతురు ఆధారంగా ల్యాండర్ కెమెరా సురక్షితమైన ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. సేఫ్ ల్యాండింగ్ కోసం ల్యాండర్ దాదాపు 100 మీటర్లు గాల్లోనే తిరిగింది. లేజర్ 3డీ స్కానర్ వినియోగించి ఏమైనా అడ్డంకులు ఉన్నాయోమోనని పరిశీలించింది.
చివరకు సేఫ్ ప్లేస్ గుర్తించి ల్యాండ్ అయింది” అని సీఎన్ఎస్ఏ తెలిపింది. కాగా, చాంగే 6 స్పేస్ క్రాఫ్ట్ లో ఆర్బిటర్, రిటర్నర్, ల్యాండర్, అసెండర్ లను జోడిం చారు. ఈ మిషన్ లో భాగంగా చంద్రుడి ఆవలివైపు నుంచి దాదాపు 2 కిలోల మట్టి, రాళ్ల శాంపిల్ ను రిటర్నర్ ద్వారా చైనా భూమికి తీసుకురానుంది. అంతా అనుకు న్నట్లు జరిగితే చంద్రుడి అవతలి వైపు నుంచి రాళ్లు, మట్టి నమూనాలను భూమికి తెచ్చిన దేశంగా డ్రాగన్ కంట్రీ రికార్డు సృష్టించనుంది.
తాజా మూన్ ల్యాండింగ్ తో చంద్రుడి ఆవలివైపున రెండు సార్లు ల్యాండ్ అయిన దేశంగా కూడా చైనా రికార్డ్ క్రియేట్ చేసింది. 2019లో మొదటిసారిగా చాంగే 4 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి అవతలి వైపున ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ అయింది.